తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్నా.. నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ చాలా మంది ప్రజా ప్రతినిధులు ఇళ్లను విడిచి బయటకు రావడం లేదు. తమను ఎన్నుకున్న ప్రజల ప్రాణాలుపోతున్నా… అధికారులే చూసుకుంటారులేనన్న అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అక్కడక్కడ ఒక్కరో, ఇద్దరో నేతలు తప్పా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ ఇందుకు మినహాయింపు కాలేదు. కానీ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం అందరిలానే తన నియోజకవర్గంలో అలా చూస్తూ ఊరుకోలేదు. ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందడుగు వేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి.. సొంత ఖర్చులు, ఎంపీ నిధులతో కోవిడ్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. దాదాపు 15 రోజులుగా అక్కడే ఉండి.. అన్ని పనులను తానే స్వయంగా పర్యవేక్షించారు. కరోనా చికిత్సకు కావాల్సిన అన్ని సౌకర్యాలను, సదుపాయాలను కల్పించారు. కట్ చేస్తే.. ఇప్పుడు బొల్లారం ఆసుపత్రి.. 50 ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్‌గా మారిపోయింది. త్వరలోనే 100 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో కూడిన పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తానని అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కరోనా కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దడంపై స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కృషిని అభినందిస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. మిగిలిన నేతలు కూడా తమ తమ ప్రాంతాల్లో ఇదే పనిచేస్తే.. బాధితులు గాంధీ, టిమ్స్, ఎంజీఎంల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదని.. రేవంత్ రెడ్డిని చూసి కనీసం ఈ ఒక్కటి అయినా నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.