ఏడాది తిరిగేలోపు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఏడేళ్లయినా ఎవరికీ ఇచ్చింది లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కోడి కోసి దావత్ ఇవ్వాలంటూ అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. లాక్‌డౌన్‌తో ఎంతో మంది కష్టాలపాలైనా.. నల్లా బిల్లు, ఇంటి పన్ను, కరెంట్ బిల్లులను రద్దు చేసే ధైర్యం రాలేకపోయిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. పైగా ఒకేసారి మూడు నెలల బిల్లులు ఇవ్వడంతో స్లాబులు పెరిగి… ఒక్కొ కుటుంబంపై రెండు నుంచి మూడు వేల రూపాయల భారం పడిందని గుర్తు చేశారు.
వరద సాయం రూ. 10వేలు ఇస్తామని చెప్పి.. టీఆర్ఎస్ నేతలే పందికొక్కుల్లా.. రూ. 5 వేల నుంచి రూ. 7వేల రూపాయల కమిషన్లుగా తీసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో ఏనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం డ్రైనేజీల మీద కప్పు వేయలేదని.. కాలువల్లో చెత్తను తొలగించలేదని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యతారహిత్యం కారణంగానే శ్రీ మేధ సైకిల్ మీద నుంచి జారి డ్రైనేజీలో కొట్టుకుపోయిందని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వినాయక నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా మోమిన్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలిసిన వాళ్లకు ప్రాధానత్య ఇవ్వాలని ఉద్దేశ్యంతో సోఫియా మోమిన్‌కు అవకాశం ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
ఎల్ఆర్ఎస్ పోవాలన్నా.. బీఆర్ఎస్ పీడ విరగడ కావాలన్నా.. కాంగ్రెస్ తరపున కనీసం 30 మంది కార్పొరేటర్లను ఇవ్వాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో తాను కొట్లాడతానని.. అలాగే బల్దియాలోనూ అభివృద్ధి కోసం కొట్లాడేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు.