టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర హుజూరాబాద్ నియోజకవర్గంలోకి చేరుకుంది. ఇల్లందకుంట మండలంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు, ఆలయ అధికారులు రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించి సీతారామచంద్రస్వామి ప్రసాదాన్ని అందించారు.
ఇటు మంగళవారం రాత్రి జరిగిన బీఆర్ఎస్ దాడిపై మరోసారి స్పందించారు రేవంత్. పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని, భూపాలపల్లిలో గొడవకు గండ్ర వెంకటరమణారెడ్డినే కారణం అని ఆరోపించారు. గండ్రపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆయన విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ నేతలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు రేవంత్. మంగళవారం హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సభ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సభలో రేవంత్ మాట్లాడుతుండగా వాహనంపై ఒక్కసారిగా దాడి జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ దాడిలో ఉద్రిక్తతల నడుమ ప్రసంగం పూర్తి చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ లూటీ అవుతోందని ఆరోపణలు చేశారు. ‘‘కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొర గడీలో గడ్డి తినేందుకు ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. పోలీసుల అండతో కొంతమంది మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నవా? నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేద్కర్ చౌరస్తాకు రా నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతాం’’ అంటూ సవాల్ చేశారు రేవంత్.