రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుంకిని పోతాంగల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు పంట నష్టం గురించి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. అకాల వర్షాల వల్ల మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారు.
ఈ సంరద్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. గ్రామాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు.
ఆ నివేదికలను కేంద్రానికి అందించి రైతులకు పరిహారం అందేలా అధికారులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకున్నట్టు ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎకరాకు రూ.40 వేల వరకు సాయం అందించామని తెలిపారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పనిముట్లపై సబ్సిడీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు.ర రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారని మండిపడ్డారు. పంట నష్టం జరిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎందుకు పర్యటించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ రైతు బీమా కాదు, పంట బీమా పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.