రాజగోపాల్ రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాటిలో కొన్నింటిపై అభ్యంతరం చెప్పారు వెంకట్ రెడ్డి. తాను బాగా హర్టయ్యానని క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ పంచాయితీ నడుస్తుండగా ఢిల్లీలో మీడియా ముందుకొచ్చారు రేవంత్. ఏం మాట్లాడతారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. వెంకట్ రెడ్డిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్.
రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వేర్వేరు వ్యక్తులు అన్న రేవంత్.. తమ మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి ఎలాంటి సంబందం లేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. వెంకన్న మావాడే అని తెలిపారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ ద్రోహి అని విమర్శించారు.
రాజగోపాల్ తో ఏ చర్చకు అయినా సిద్ధంగా ఉన్నానని.. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా చర్చ జరగలేదని వివరించారు. బీజేపీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భద్రాచలం ముంపునకు కారణం మోడీ, ఆయన మంత్రివర్గం అని విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల పేరుతో ప్రలోభాలు పెడుతున్నారని మండిపడ్డారు.
చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తికి కారణమని ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ తీసుకునే చర్యలను తెలంగాణ ప్రజలు ఆహ్వానించాలని కోరారు. ఇక చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఏర్పడ్డాక పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశానని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను బలపరిచామని పేర్కొన్నారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం త్వరలో పీసీసీ కమిటీ ఉంటుందని తెలిపారు.