– కాంగ్రెస్ గొడవలపై కీలక వ్యాఖ్యలు
– మర్రి బీజేపీలో చేరికపై ఆగ్రహం
– పార్టీ నిధులు నొక్కేశారని ఆరోపణ
– దాసోజు సీక్రెట్స్ రివీల్
– నలుగురితోనే విభేదాలంటున్న రేవంత్
– డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా.. పార్టీలో ప్రక్షాళన
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలా మారింది సీన్. కాంగ్రెస్ పార్టీ రేసులో వెనుకబడిపోయింది. దానికి అంతర్గత కుమ్ములాటలే కారణం. రేవంత్ నాయకత్వాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. బహిరంగంగానే కొందరు నేతలు ఆయన్ను టార్గెట్ చేయడం చూశాం. అధిష్టానం కలగజేసుకోవడంతో అప్పటివరకు సైలెంట్ అవుతుంది గానీ.. కాస్త గ్యాప్ తర్వాత ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఈమధ్యే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అంతకుముందు దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. అయితే.. వీళ్లిద్దరూ ప్రధానంగా ఆడిపోసుకుంది రేవంత్ రెడ్డినే.
నలుగురైదుగురితోనే ప్రమాదం!
టీపీసీసీ చీఫ్ ఒంటెద్దు పోకడల వల్లే తాము రాజీనామా చేయాల్సి వస్తోందని వెళ్లిపోతున్న వాళ్లంతా ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లు ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి తాజాగా తనపై చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్ననలుగురైదుగురు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మిగిలినవాళ్లంతా తనను అంగీకరించినట్లు తెలిపారు. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటామని, ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యారనడం సరికాదని పేర్కొన్నారు.
మర్రి, దాసోజుకు కౌంటర్స్
కాంగ్రెస్ ట్రస్ట్ కు సంబంధించిన కోట్లాది రూపాయల సొమ్మును మర్రి శశిధర్ రెడ్డి స్వాహా చేశారు.. ఆ డబ్బుల గురించి అడిగినందుకే పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారని అన్నారు రేవంత్. శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి 2018లో తెలంగాణ జనసమితి పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనుకునే ఆయన టీజేఎస్‌లో చేరినట్లు విమర్శించారు. విజయారెడ్డి చేరిక సందర్భంగా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని, సర్వేల ఫలితాలు అనుకూలంగా ఉంటే ఖైరతాబాద్ సెగ్మెంట్ టికెట్ కూడా ఇస్తామని దాసోజు శ్రవణ్ కు చెప్పినట్లు రేవంత్ బయటపెట్టారు. అయినా తనకు వ్యతిరేకంగా విజయారెడ్డిని తీసుకొచ్చారనే కారణంతో ఆయన పార్టీ మారినట్లు వివరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ముగ్గురు మాత్రమే పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
నాతో సమానంగా పోరాడారా?
అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు.. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏ రోజైనా రోడ్డెక్కారా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ విచారణను ఖండిస్తూ వేలాది మంది పార్టీ కార్యకరలు ధర్నాలు చేస్తే వారంతా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. తాను పీసీసీ అధ్యక్షుడినయ్యాక 30 మందికిపైగా పార్టీలో చేరారని గుర్తు చేశారు. అనవసర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
డిసెంబర్ మొదటి వారంలోగా మార్పులు
టీపీసీసీపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. సీనియర్లు పార్టీని వీడుతుండడంపై ప్రత్యేక దృష్టి సారించింది. రేవంత్ ను ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూనే ప్రియాంక గాంధీ అంతా చక్కబెడతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని నియమించనున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.