- ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ..
రాష్ట్రంలో హోం గార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బంది ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో హోంగార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బందికి వెంటనే జీతాలు అందించాలని రేవంత్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాడు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ పాలనలో విలువైన భూముల అమ్మేస్తున్నారని, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలపై పలు రకాల పన్నుల భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీల పెంపు సహా భూముల రిజిస్ట్రేషన్, బస్ ఛార్జీలు పెంచారని అన్నారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా పత్రికల్లో కేసీఆర్ మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు రేవంత్. మరి హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించరా అని ప్రశ్నించారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని నిలదీశారు. ఇప్పుడు మోడల్ స్కూళ్లలో టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
మరోవైపు తొలకరి మొదలై వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేయలేదని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. ఈ సారి రైతుబంధు ఉంటుందా? ఉంటే ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా కేసీఆర్ తిరుగుతున్నారని, అసలు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.