టీఆర్ఎస్ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రామాయంపేట తల్లీకుమారుల కుటుంబానికి ధైర్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మృతుడు సంతోష్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వారిని పరామర్శించారు. మెదక్ డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి రామాయంపేట వెళ్లారు. అక్కడ సంతోష్ ఫ్యామిలీతో మాట్లాడి.. రేవంత్ తో మాట్లాడించారు.
సంతోష్ తండ్రి అంజయ్య, సోదరుడు శ్రీధర్ ను ఓదార్చారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. తమకు న్యాయం చేయాలని, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని సంతోష్ కుటుంబసభ్యులు రేవంత్ కు వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు రేవంత్.
రామాయంపేటకు చెందిన గంధం పద్మ, ఆమె కుమారుడు సంతోష్ కామారెడ్డిలోని ఓ లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు దానికి గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు సంతోష్. తమ వ్యాపారంలో పాట్నర్ గా ఉన్న వ్యక్తితో పాటు.. మరో ఏడుగురు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అందుకే తాము చనిపోతున్నట్లు చెప్పాడు.
“బాసం శ్రీనుతో కలిసి నేను వ్యాపారం చేశా. అతని దగ్గర డబ్బులు లేకపోతే మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ కోరాడు. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్ కు పిలిచారు. నా ఫోన్ అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరుసటి రోజే మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్‌బుక్ అంశంలో సంబంధం లేదన్నారు. కానీ.. నా ఫోన్ లో సమాచారాన్ని జితేందర్ గౌడ్ కు ఇచ్చారు పోలీసులు. అప్పటి నుంచి అతని మనుషులు ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పీఎస్ లో ఫిర్యాదు చేశా. ఏడాది పాటు జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అర్థికంగా నష్టపోయాను. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాను. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేకే నేను, అమ్మ చనిపోతున్నాం” అని సెల్ఫీ వీడియోలో వివరించారు సంతోష్.