ప్రగతి భవన్ ను పేల్చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహంతో ఉంటే.. హస్తం పార్టీ సమర్ధించుకుంటోంది. ఎమ్మెల్యే సీతక్క దీనిపై స్పందిస్తూ.. రేవంత్ వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు. కేసీఆర్ కూడా నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అన్నారు కదా అని ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండాలో దొరల గడీలు బద్దలుకొట్టే అంశం కూడా ఉందని.. ఇప్పటి బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లలో మాజీ మావోయిస్టులు లేరా అని అడిగారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనలు చేయడం తమకు ఆశీర్వాదంతో సమానమని చెప్పారు సీతక్క.
ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసమని.. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకని కేసీఆర్ ను ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నానన్నారు రేవంత్. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత తాము తీసుకుంటామని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండానే తన ఎజెండా అన్న కేసీఆర్ ను సమర్ధించారు.. ఇప్పుడు తాను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సల్స్ ఎజెండాలో ఉందా? అని అడిగారు. తెలంగాణ ప్రజల ఆలోచననే తాను చెప్పానన్న రేవంత్.. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసమే యాత్ర చేపట్టినట్లు చెప్పారు.
‘‘మేం గాంధీ వారసులం.. హింసకు వ్యతిరేకం. శాంతి కోసమే ఈ యాత్ర. తెలంగాణ వచ్చాక ఎన్ కౌంటర్లు ఉండవని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్ కౌంటర్లకు ఆయన ఏం సమాధానం చెబుతారు? 9 నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ, 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు. వృధా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుంది’’ అని సూచించారు రేవంత్ రెడ్డి.