– చెట్టు సచ్చిపోతే సర్పంచుపై చర్యలన్న కేసీఆర్..
– అభివృద్ధి విషయంలో కేటీఆర్ ను సస్పెండ్ చేస్తారా?
– హైదరాబాద్ ని అధ్వానంగా మార్చారు..
– ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి తెచ్చారు
– సర్పంచులు అప్పులపాలవుతున్నా పట్టింపులేదు
– ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులు జమ చేయాలి
– సర్పంచుల ధర్నాలో రేవంత్ రెడ్డి డిమాండ్
తెలంగాణలో కేసీఆర్ భస్మాసురుడిగా మారిపోయారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన్ను పొలిమేర్ల నుంచి తరమండని.. రాష్ట్రంలో సర్పంచులు తలుచుకుంటే బొంద పెట్టొచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ తెచ్చిన చట్టం రద్దు చేస్తామని చెప్పారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ తీరుతో సిరిసిల్లలో ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని.. మునుగోడులో మరో సర్పంచ్ బిక్షం ఎత్తుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచులకు ఆత్మగౌరవం లేదా అని ప్రశ్నించారు రేవంత్. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ నిధులతో మేఘా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ ల కాంట్రాక్టులకు బిల్లలు కట్టారని విమర్శించారు. సర్పంచులు అడుక్కోవడం మానేసి.. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చెట్టు సచ్చిపోతే సర్పంచులను సస్పెండ్ చేస్తామన్న కేసీఆర్.. హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ ను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్ లకే దక్కతుందన్నారు రేవంత్. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని.. జీతాల కోసం 28వేల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. సర్పంచుల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సర్పంచుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ నిధులను దొంగిలించారని ఆరోపించారు.
సర్పంచులు ఆస్తులమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారని.. ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులను వారికి జమ చేయాలన్నారు రేవంత్. నిధులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచులపై పోలీసుల నిఘా ఉందని.. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని ఫైరయ్యారు రేవంత్ రెడ్డి.
ఇటు కొందరు సర్పంచులు మాట్లాడుతూ.. తమను అరిగోస పెడ్తున్న కేసీఆర్ కు పాపం తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. నిధులు రాక, అప్పులు కట్టలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించారని వాపోయారు. మొదటి ఏడాది చెక్ పవర్ ఎవరికీ ఇవ్వకుండా కాలం గడిపిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి చెక్ పవర్ ఇచ్చినట్లే సీఎంకు, డిప్యూటీ సీఎంకు కలిపి ఇస్తే బాగుండేదన్నారు సర్పంచులు.