ఒకే ఒక్క సభ.. కాంగ్రెస్ లో నయా జోష్ నింపితే టీఆర్ఎస్ నేతలకు భయాన్ని పరిచయం చేసింది. రేవంత్ అడిగిన ఒక్కో ప్రశ్న.. తూటాల్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని తాకాయి. అందుకే వరుసబెట్టి గులాబీ నేతలు రేవంత్ పై దండయాత్రకు దిగారు. అటు కాంగ్రెస్ వర్గాలు ధీటైన జవాబు ఇస్తున్నాయి. అయితే ఇంద్రవెల్లి సభ సక్సెస్ తో రేవంత్ పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ ఉంటుందని ఇంద్రవెల్లి సభలోనే ప్రకటించారు రేవంత్. దాని తర్వాత వరంగల్ వేదికగా సభ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి సమన్వయ కర్తల నియామకం కూడా పూర్తి చేశారు. వరంగల్ కు ఆనుకుని ఉన్న హసన్ పర్తిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఇంద్రవెల్లి సభ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ సభకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా కార్యకర్తలను రప్పించి భారీ సక్సెస్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక.. సీనియర్లలో కొంత విభేదాలున్నా మెల్లగా సర్దుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలోనూ క్యాడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. పైగా ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడంతో పార్టీకి వేవ్ కనిపిస్తోందని భావిస్తున్నారు నేతలు. ఇదే జోష్ ను మున్ముందు కొనసాగించాలని బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు.