వరంగల్ డీక్లరేషన్, రైతు సంఘర్షణ సభకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరాభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, పలు అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు. అందరి కృషి వల్ల రైతు సంఘర్షణ సభ విజయవంతం అయిందని చెప్పారు రేవంత్. చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని.. అందులో తీసుకున్న అన్ని అంశాలను ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ సోనియా గాంధీకి పంపాలని నిర్ణయించామన్నారు.
ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ చేసిన తీర్మానాన్ని మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు బలపరిచారని చెప్పారు రేవంత్. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశామని.. వరంగల్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలని చెప్పారు.
మే 21 నాడు ప్రతి ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలన్నారు రేవంత్. 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఈ సభలు జరగాలని చెప్పారు. జూన్ 21 వరకు వీటిని కొనసాగించాలని తెలిపారు. పీసీసీ అధ్యక్షులుగా తాను వరంగల్ జిల్లాలో జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని చెప్పారు.
ఇక జనజాగరన్ అభియాన్ యాత్ర కార్యక్రమాలు.. పెరిగిన ధరలపై కూడా ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు తెలిపారు రేవంత్. రాహుల్ గాంధీ 100 కిలోమీటర్ల పాదయాత్ర తెలంగాణ నుంచే మొదలవ్వాలని కోరదామన్నారు. డిజిటల్ మెంబెర్ షిప్, వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ మోడల్ గా పేరొచ్చిందన్న రేవంత్.. రాహుల్ పాదయాత్ర కూడా ఇక్కడే చేపట్టి హ్యాట్రిక్ కొడుదామని చెప్పారు. అందరి కష్టంతోనే ఇవన్నీ సాధించామని.. ఇంకో ఏడాది కష్టపడితే అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు.