– మోడీ, కేసీఆర్ ది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం
– పైకి గొడవ ఉన్నట్లు యాక్టింగ్
– తెర వెనుక ఫ్రెండ్షిప్
– కేసీఆర్ మారడు.. మార్చాల్సిన సమయం వచ్చింది
– కార్మిక సంఘాలపైనా కుటుంబ గుత్తాధిపత్యమే!
– సింగరేణి కార్మికులను కలిసిన రేవంత్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా 16వ రోజు బొగ్గు కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేసీఆర్, మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అవిభక్త కవలల్లా కలిసే ఉన్నారని.. ఇప్పుడు యుద్ధం ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మోడీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించింది వాస్తవం కాదా? అని అడిగారు రేవంత్. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారని ప్రశ్నించారు. అక్కడి మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంతన్నారు. ఒడిశాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానీకి అమ్మేస్తే.. దానిపై తాము కొట్లాడామని, అందుకే అమ్మకం ఆగిపోయిందని వివరించారు. ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఆ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
సీఎండీ శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనుక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏంటో ఆలోచించాలని కార్మికులను కోరారు రేవంత్ రెడ్డి. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాలా తీయించేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. బొగ్గు గని కార్మిక సంఘానికి ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారన్నారు. కార్మిక సంఘాలపైనా కేసీఆర్ కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతోందని విమర్శించారు.
సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా కూడా.. బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు రేవంత్. వేలాది కోట్లు కొల్లగొట్టడానికే తప్ప.. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదన్నారు. కేసీఆర్ మారడు.. ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి.