రేవంత్ రెడ్డిపై చీటికిమాటికి చిటపటలాడే జగ్గారెడ్డి ఎట్టకేలకు అలకపాన్పు దిగినట్లు కనిపిస్తోంది. సీఎల్పీ కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
రేవంత్ టీపీసీసీని వ్యతిరేకించిన వారిలో జగ్గారెడ్డి కూడా ఉన్నారనే టాక్ ఉంది. ఆయన తీరుపై తరచూ ప్రెస్ మీట్లలో బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. మొన్నీమధ్య అయితే.. పార్టీలో ఉండనని రాజీనామా బాంబ్ పేల్చారు. సీనియర్లతో భేటీల తర్వాత కాస్త చల్లబడ్డారు.
నిన్నటికి నిన్న రేవంత్ మెదక్ పర్యటన సమయంలోనూ విమర్శలు చేశారు జగ్గారెడ్డి. సీఎల్పీ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే.. తాజాగా సీఎల్పీ ఆఫీస్ లో రేవంత్ ఎదురుపడగా జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరు కుర్చుని సమావేశమయ్యారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు, రాజీనామా విషయంపై రేవంత్ తో జగ్గారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బలోపేతానికి మీతోపాటు కృషి చేస్తానని రాజీనామా చేయనని రేవంత్ కు జగ్గారెడ్డి మాటిచ్చినట్లుగా సమాచారం. భేటీ తర్వాత బయటకు వచ్చిన జగ్గారెడ్డిని ఏం మాట్లాడుకున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు అడగ్గా.. అంతా సీక్రెట్ బయటకు చెప్పనని వెళ్లిపోయారట.