కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీనికి కారణం బీఆర్ఎస్ శ్రేణులే అని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దీని వెనుక ఉన్నారని.. పవన్ హత్యకు కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. ఎర్రబెల్లి, శంకర్ నాయక్ ఇతర ఎమ్మెల్యేలు వార్నింగులతో రెచ్చగొట్టడం వల్లే విపక్ష పార్టీల యాత్రలు, సభలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.
పవన్ పై దాడి ఘటనపై చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డికి సీపీ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక దాడి జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్ లో ఉన్నవారి మొబైల్స్ సీజ్ చేసి విచారించాలని రేవంత్ కోరారు.
గంజాయి బానిసలను ముఠాలుగా చేసి.. బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కమిషనర్ కు రేవంత్ వివరించారు. సీపీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం ఫాంహౌస్ అయినా.. వరంగల్ హంటర్ రోడ్డు అయినా ఎక్కడికైనా తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.
అంతకుముందు.. దాడిలో గాయపడ్డ తోట పవన్ ను ఆస్పత్రిలో పరామర్శించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు కాపాడుతున్నారన్నారు. ఇది మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుబంధ విభాగం కాదని.. ఏ రాజకీయ పార్టీ వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఆదేశాలు ఇస్తున్న వాళ్లు శాశ్వతం కాదన్న ఆయన.. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీని అణిచివేయాలని సూచించారు. సీసీటీవీలో అంతా కనిపిస్తోందని.. ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పైగా తమతో పెట్టుకుంటే.. ఇలాగే జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.