తెలంగాణ మాత్రమే కాదు..దేశవ్యాప్త రాజకీయ పండితులు ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.జవజీవాలు లేని తెలంగాణ కాంగ్రెస్ ఇదేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అటు అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల్లోనూ అదే ఆశ్చర్యం.నేల ఈనినట్టు ఎక్కడ చూస్తే అక్కడ జనం..గజ్వేల్ గల్లీగల్లీలో మూడు రంగుల జెండాలు.. జై కాంగ్రెస్ నినాదాల హోరు. ఇంతకీ రేవంత్ సక్సెస్ కు కారణమేంటి..?అధికార పార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించిన రేవంత్ మైండ్ గేమ్ పనిచేసిందా…?
సభకు లక్ష మంది జనం రావాలని టార్గెట్ పెట్టుకుని కాంగ్రెస్ రంగంలోకి దిగితే.. టీఆర్ఎస్ పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మీటింగ్ రోజే గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయించటం, డబుల్ బెడ్ రూం సర్వేలు చేస్తున్నాం జనం ఇండ్లలోనే ఉండాలని ప్రచారాలు చేయటంతో పాటు ప్రతి ఊర్లో టీఆర్ఎస్ నాయకులతో విందులు..అయినా, సభకు జనం భారీగా వచ్చారు. సభ వద్ద ఎంత జనం ఉన్నారో బయట వాహనాల్లో అంత జనం ఉన్నారు.ఎందుకంటే.. రేవంత్ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇంచార్జ్ లను వేయటం కలిసొచ్చింది. పైగా ప్రతి బూతు నుండి 9మంది కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలన్నరేవంత్ పిలుపు పక్కగా పనిచేసింది.
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మెదక్, వరంగల్ నుండి జనం మీటింగ్ కు వచ్చారు. అందుకే రేవంత్ కూడా నీ అధికారులతో లెక్క పెట్టించు… లక్ష మందికి ఒక్కరు తక్కువయ్యారేమో అని ప్రశ్నించారు. అంతేకాదు ఆరు నెలల్లో మళ్లీ సభ పెడతానంటూ ప్రకటించారంటే తన కాన్ఫిడెన్స్ ఎంతో అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.
దళిత గిరిజన సభతోనే ఇంత మంది జనం వస్తే… రేవంత్ రెడ్డి ఇక నిరుద్యోగ సమస్యను ముందుకు తీసుకరాబోతున్నారు. దీంతో రేవంత్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న యూత్ ఇష్యూ కావటంతో ఈసారి సభలకు మరింత స్పందన వచ్చే అవకాశం ఉందంటున్నారు.