తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ మొదలైందా? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ కు ప్లాన్ జరగ్గా.. ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. జీవన్ రెడ్డి, మధుయాష్కీ ఈ విషయంలో కలగజేసుకుని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఇది మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.

అయితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు వేరే అర్థం తీసుకోవద్దని చెప్పారు మధుయాష్కీ. బలహీనంగా ఉన్న చోటకు వెళ్లాలని మాత్రమే అన్నారని తెలిపారు. మే 6న రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్ లో కాంగ్రెస్ ఏర్పాటు చేసే రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి.
27న నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులతో రేవంత్ సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. అది 29కి వాయిదా పడింది. దీనికి కోమటిరెడ్డి, ఉత్తమ్ కారణమనే వాదన ఉంది. జానారెడ్డి చక్రం తిప్పి వారికి నచ్చజెప్పారని టాక్. ఇలాంటి సమయంలో రేవంత్ నిర్వహించే సమావేశానికి వెళ్లనని కోమటిరెడ్డి ప్రకటించడం.. పార్టీ అధ్యక్షుడికి ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుందని జీవన్ రెడ్డి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో వివాదాలు ఇంకా సమసిపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.