సమాజానికి హాని కలిగేలా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, అంజన్ కుమార్ యాదవ్ సహా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఆర్థిక సంక్షోభం రాకుండా ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా, మత సామరస్యాన్ని కాపాడాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
క్రూరమైన ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు రేవంత్. మానవమాత్రులుగా తాము చేయాల్సింది చేశామని.. ప్రతిపక్షాల బాధ్యత నిర్వర్తించామన్నారు. కానీ పాలకులు ఎవరూ వినిపించుకోనే పరిస్థితిలో లేరని విమర్శించారు. సమస్యలను సృష్టించే వ్యక్తులకు అమ్మవారే సమాధానం చెబుతారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారిన నాయకులకు కనువిప్పు కలిగించాలి.. లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అలాగే.. మానవ తప్పిదాల నుంచి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు రేవంత్. ఈమధ్య కురిసిన భారీ వర్షాలతో గోదావరి పరివాహక జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యం ఉందని మొదట్నుంచి చెబుతున్నారు రేవంత్. ఇప్పుడు మరోసారి విమర్శల దాడి కొనసాగించారు.
మరోవైపు రేవంత్ పర్యటన సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనతో పాటు వచ్చిన నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఖాకీలకు, రేవంత్ కు మధ్య వాగ్వాదం నడిచింది. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటోకాల్ పాటించడం ఏంటని టీపీసీసీ చీఫ్ ఫైరయ్యారు.