రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాహుల్ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. రెండు నెలల పాటు సాగే యాత్రలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల అసంబద్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
ఈనెల 6న ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు హాత్ సే జోడో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు మాణిక్ రావు. సీఎల్పీ నేతల భట్టి, మధుయాష్కీ, ఉత్తమ్ సహా ఇతర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను మొదలుపెడతారని వివరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు యాత్ర చేస్తానని తెలిపారు.
గతంలో చేవెళ్ల నుంచే వైఎస్సార్ పాదయాత్ర చేపట్టారని.. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మొదలైందని అన్నారు రేవంత్. ఆనాడు రాజులు, రాచరికం మీద పోరాడిన సమ్మక్క, సారాలమ్మ స్ఫూర్తితోనే ఈ యాత్ర చేపడుతున్నానని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ పాలనపై మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆ రెండు పార్టీల నేతలు నాటకాలకు తెర లేపారని మండిపడ్డారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో వీరి నాటకం బట్టబయలైందన్నారు రేవంత్. గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించారని విమర్శించారు. మొన్నటిదాకా అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును చెండాడిన గవర్నర్.. ఇప్పుడు స్వరం ఎందుకు మార్చారని ప్రశ్నించారు. కేటీఆర్ కు క్యాట్ వాక్, డిస్కో డాన్స్ ల గురించి మాత్రమే తెలుసన్న రేవంత్.. దేశ సమగ్రత గురించి మాట్లాడేంత అవగాహన ఆయనకు లేదని సెటైర్లు వేశారు.
కేటీఆర్ కు రాహుల్ ను విమర్శించేంత స్థాయి లేదన్నారు రేవంత్. తండ్రీ, కొడుకులకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని.. కాంగ్రెస్ కు దేశ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు.119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లిచ్చారని ప్రశ్నించారు. కనీసం మంత్రుల సొంత గ్రామాల్లోనైనా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా? అని అడిగారు. అంతెందుకు చింతమడక, ఎర్రవెల్లిలో అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని కోరారు.
ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలని అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే కుమారుడికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చారని చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పిన ఆయన.. అమరుల కుటుంబాలు అనాధలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ తో విపరీతమైన సమస్యలు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి.