కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. గులాబీ గూటికి చేరుతున్నారని రెండు రోజులుగా ఒకటే చర్చ. పార్టీలో తనను కోవర్ట్ అంటూ అవమానిస్తున్నారనేది ఆయన ఆవేదన. ఈ క్రమంలోనే అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి, పార్టీ ఇంఛార్జ్ లు మాణిక్కం ఠాకూర్, వేణుగోపాల్ కు లేఖ రాశారు. ఇకనుంచి తాను కాంగ్రెస్ పార్టీ గుంపులో లేనని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న విషయాలను వివరిస్తూ.. సడెన్ గా లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావొచ్చనే అంశాన్ని హైలెట్ చేశారు. త్వరలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీకి రాజీనామా చేసి మరో లేఖ పుంపుతానన్నారు. వేరే పార్టీకి వెళ్లడం ఇష్టం లేదని.. అమ్ముడుపోయాననే మచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు మాట్లాడుతుంటే తనపై కోవర్ట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో అధిష్టానానికి వివరించారు.
అంతకుముందు జగ్గారెడ్డిని వీ హనుమంతరావుతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ కలిశారు. కాంగ్రెస్ ను వీడొద్దని సూచించారు. బొల్లి కిషన్ అయితే.. ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని మరీ బతిమాలారు. పార్టీలోనే ఉంటూ కొట్లాడదామని సూచించారు.
మరోవైపు జగ్గారెడ్డి అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయం టీ కప్పులో తుపాను లాంటిదన్నారు. ఇది తమ కుటుంబ సమస్యగా వ్యాఖ్యానించారు. కుటుంబం అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయని.. తామే పరిష్కరించుకుంటామని వెల్లడించారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. అన్నీ సర్ధుకుంటాయని తెలిపారు. మీడియా దీన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్న ఆయన.. గోతికాడ నక్కలా చూసే టీఆర్‌ఎస్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి.