– కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
– రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై చర్చ
– కేసీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్
నచ్చినవాళ్లకు నజరానా.. నచ్చనివాళ్లకు జరిమానా అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.
తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులకు ఐదు శాఖలు ఇచ్చి మిగతా వారిని ఊరికే కూర్చోబెట్టారని విమర్శించారు రేవంత్. సమర్థులైన కొందరు ఐపీఎస్ లకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే ప్రమోషన్ పొందిన వాళ్లను కూడా ఊరికే కూర్చోబెట్టారని పేర్కొన్నారు. కొంతమంది ఐపీఎస్ లకు గంపగుత్తగా చాలా శాఖలు అప్పజెప్పారని.. ఎన్నో ఏళ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారని వివరించారు. సమర్థులను పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్ లు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారని… హైదరాబాద్ లో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు రేవంత్. నగరంలో పట్టపగలు కూడా పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపే పరిస్థితి లేదని ఆరోపించారు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థులైన వ్యక్తులకు పోస్టింగులు ఇవ్వాలని హితవు పలికారు. నిజాయతీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని దుయ్యబట్టారు.
ఇక మైనర్ బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన రేవంత్.. ఈ ఘటనలో వీడియో కావాలనే బయటపెట్టారని అన్నారు. ఒప్పందంలో భాగంగానే రఘునందన్ రావు వీడియో విడుదల చేశారని ఆరోపించారు. ఈ కేసులో జోయల్ డేవిస్.. స్వాతిముత్యంలో కమల్ హాసన్ కంటే ఎక్కువ నటించారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని… మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.