– కేసీఆర్ జాతీయ పార్టీపై రేవంత్ సెటైర్లు
– రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దగా చూపించుకుంటున్నారు
– జాతీయస్థాయిలో కేసీఆర్ కు అంత సీన్ లేదు
– ఎవరూ పట్టించుకోవడం లేదు
– ఆయనవన్నీ చిల్లర ప్రయత్నాలు
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది కాంగ్రెస్. గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సహా ముఖ్య నాయకులు హజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ పలు అంశాలపై మాట్లాడారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పందించిన ఆయన.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తా అని అంటున్నారు.. ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారని ఎద్దేవ చేశారు. అయినా.. అభ్యర్థులను పెట్టి కేసీఆర్ ప్రచారం చేయగలరా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అనుకోకుండా సీఎం అయ్యారని.. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రేవంత్. జాతీయస్థాయిలో కేసీఆర్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు. ఆయనవన్నీ చిల్లర ప్రయత్నాలు అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ ను చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారని ఎద్దేవ చేశారు రేవంత్. కాంగ్రెస్ ఉనికిలేనప్పుడు పొత్తు పెట్టుకుంటానని తమ నేతల కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే పక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ను ఒక మాయల పకీరు అంటూ అభివర్ణించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలోనే పోటీ చేస్తారని అన్నారు రేవంత్‌రెడ్డి.
కబ్జాలు, అత్యాచారాలలో కూడా టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కలిసే పని చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. ప్రపంచంలోని అన్ని విషయాలపై స్పందించే అసదుద్దీన్ జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం మౌనం వెనుక కారణాలేంటని నిలదీశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని.. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. 15వ తేదీన హైదరాబాద్ బచావో పేరుతో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన రేవంత్.. దీనికి టీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా పిలుస్తామని చెప్పారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 13 న రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని… రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని.. ఆ కుటుంబానికి కష్టం వస్తే ప్రతి కార్యకర్త స్పందిస్తారని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదన్న రేవంత్.. అయినా ఈడీ ద్వారా సోనియా, రాహుల్ కు కావాలనే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.