ప్రధాని మోడీ స్పీచ్ పై అసహనం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వస్తుంటే ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి నిరిష్ట ప్రణాళిక ప్రకటిస్తారని ఆశించామన్నారు. ఉకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాలుష్యం తప్ప ఈ సమావేశాలతో ఒరిగిందేమీ లేదని చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు విభజన చట్టంలో స్పష్టమైన హామీలు ఇచ్చిందన్న ఆయన.. గిరిజన వర్సిటీ, ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్, బయ్యారంలో ఉక్కు కార్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇలా అన్నీ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిందని వివరించారు.
తెలంగాణ ఏర్పాటు సహకరించామని జబ్బులు చరుకుచునే బీజేపీ.. అమలు చేయాల్సిన హామీల్లో మాత్రం పూర్తిగా మొండిచేయి చూపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను కూడా అటకెక్కించిందని.. తెలంగాణ యువతకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు రాకపోవటానికి కారణం ఏంటని నిలదీశారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని… ఇవి కాకుండా బీజేపీ అధికారంలోకి రావడానికి నల్లధనం తెచ్చి ప్రతీ పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.
‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు. అది చేయకపోగా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. ఉదాధి కరువై యువత ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వానికి 8 ఏళ్లుగా ప్రతీ నిర్ణయంలో ప్రతీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తూ వచ్చింది. అభివృద్ధి విషయంలో మొండి చేయి చూపిన బీజేపీ కనీసం కేసీఆర్ కుంటుంబం అవినీతిపై చర్యలకు సంబంధించి ఏం చేయబోతోందో చెప్పలేదు. గడిచిన 3 ఏళ్లుగా కేసీఆర్ అవినీతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు హెచ్చరికలు చేయడం తప్ప ఒక్క అడుగు కూడా చర్యల దిశగా పడలేదు. కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని చెప్పారు. కానీ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటే మాత్రం సమాధానం లేదు’’ అని మండిపడ్డారు రేవంత్.
బీజేపీ నేతల ప్రసంగాల్లో అధికార దాహం తప్ప తెలంగాణ త్యాగాల గురించి, అమరవీరుల త్యాగాల గురించి గానీ, ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారిల గురించి ప్రస్తావించకపోవడం తెలంగాణ పట్ల బీజేపీ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. తెలంగాణ పోరాట పటమను ప్రస్తావించకపోగా ఏర్పాటును అవమానించేలా అమిత్ షా మాట్లడటం దుస్సాహసమని… దీనికి మోడీ, షా తెలంగాణ ప్రజలకు క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సమావేశాల తర్వాత టీఆర్ఎస్ వీధి నాటకాలను గమనించిన తర్వాత.. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన మాత్రమే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనతో మాత్రమే అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ప్రజలు, సుఖశాంతులతో జీవించే పరిస్థితి ఉంటుందనే ప్రజలకు అర్ధమైందన్నారు. ఇరు పార్టీలకు వీడ్కోలు పలకడమే మిగిలి ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి.