– విభజన హామీలు ఏమయ్యాయి?
– ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలేనా?
– కేసీఆర్ అవినీతి చేస్తే చర్యలేవి?
– మీ చీకటి ఒప్పందం అడ్డుపడుతోందా?
– మోడీని నిలదీసిన రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పీఎం హైదరాబాద్ పర్యటన సందర్బంగా మొత్తం 9 ప్రశ్నలను అందులో సంధించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ది ఫెవికాల్ బంధం అని విమర్శించారు. మీరంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు కానీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని రైతులు, యువత, విద్యార్థి సమస్యలపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవీ తెలంగాణ రాలేదన్నారు రేవంత్. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రం నష్టపోతోందని మండిపడ్డారు. పైకి ఉప్పు నిప్పులా ఉంటూ.. పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తూ.. లోపాయకారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేస్తున్నట్టు ఇప్పటికే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ప్రధాన మంత్రిగా పార్లమెంట్ లో మీరు తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ప్రాణహిత,చేవెళ్ల పథకం రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారు. పెద్దఎత్తున అవినీతి జరిగిందని మేం ఆరోపించాం.. మీ అధ్యక్షులు జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మరి ఎందుకు విచారణ జరపడం లేదు.. మీ ఇద్దరి చీకటి స్నేహం అడ్డుపడుతోందా?” అంటూ ప్రశ్నించారు రేవంత్. ఆర్మూర్ లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డ్ ఏమైందని నిలదీశారు.
ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫాక్టరీ, బయ్యారం ఇనుము ఫ్యాక్టరీ ఏమయ్యాయని నిలదీశారు. ఒడిశాలోని నైనికోల్ మైల్ లో జరిగిన అక్రమాల విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నారు. చీకటి మిత్రుడు కేసీఆర్ బంధువులు అందులో ఉన్నారని చర్యలు తీసుకోవడం లేదా? అంటూ మోడీని ప్రశ్నించారు రేవంత్. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. జగన్, కేసీఆర్ స్నేహంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ రాలేదని గుర్తు చేశారు. ఒకరిపై ఒకరు చెపుతూ ఈ విషయాన్ని దాటవేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని మీరిచ్చిన హామీ ఏమైందని నిలదీశారు రేవంత్. రామాయణం సర్క్యూట్ లో భద్రాచలం ఎందుకు చేర్చలేదని.. వీటన్నింటిపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.