పాలకుర్తి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. దేవరుప్పుల మండలం ధర్మపురంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఊరికి దూరంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి నిరుపయోగంగా మారాయి. అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయని స్థానికులు వివరించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిసరాలను చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎటుచూసినా ఖాళీ లిక్కర్ సీసాలు కనిపిస్తున్నాయని.. పేదవాడికి ఇళ్లు పంచడానికి కేసీఆర్ కు మనసు రావడం లేదని మండిపడ్డారు. లబ్దిదారులు ఇంకెన్నాళ్లు ఎదురుచూపులు చూడాలని ప్రశ్నించారు.
దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామంలో మహిళా రైతులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారిని విజ్ఞప్తి చేశారు.
ఇక శ్రీ సేవాలాల్ మహరాజ్ 284 జయంతి సందర్భంగా పూజల్లో పాల్గొన్నారు. బంజారాలతో కలిసి చిందేశారు రేవంత్. అంతకుముందు భద్రాచలంలోని శ్రీ సీతారాముల ఆలయాన్ని దర్శించుకున్నారు. రాక్షస పాలన అంతం చేస్తామని, రాముడి పాలనే తన లక్ష్యమని ట్వీట్ చేశారు. శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో జన శంఖారావమై వస్తున్నానని పేర్కొన్నారు.