హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ అర్బన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి ఆధ్వర్యంలో అర్గుల్ రాజారాం మెమోరియల్ లో హాత్ సే హాత్ జోడో ఫుట్ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు.
ఫుట్ బాల్ పోటీలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా క్రీడాకారులతో కలిపి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపీలు ఆయనతో పాటు ఫుట్ బాల్ ఆడారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు కాంగ్రెస్ నాయకుల కేరింతల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ ఆహ్లాదంగా సాగింది.ఇక రేవంత్ రెడ్డి యాత్ర 25 రోజులు దాటింది. ఆయన పాదయాత్రలో భాగంగా స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి కాంగ్రెస్ పార్టీ తరపున హామీలను ఇస్తూ వెళుతున్నారు.
అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నిండుతుంది. మరో వైపు రేవంత్ రెడ్డి యాత్రకు ధీటుగా భట్టివిక్రమార్క పాదయాత్ర కూడా మొదలైంది. మొత్తానికి హాత్ సే హాత్ జోడో అభియాన్ తో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పార్టీలో కదలిక మొదలైంది.