– పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ నాటకాలు
– 33 జిల్లాల్లో పర్యటిస్తా..
– కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా..
– కొల్లాపూర్ గడ్డపై రేవంత్ ప్రకటన
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో మన ఊరు-మన పోరు కార్యక్రమంలో ప్రసంగించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని ప్రశ్నించారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని.. ఇస్తామన్న పరిహారం, ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రం దశ దిశ మార్చే శక్తి కాంగ్రెస్ కు ఉందన్నారు.
కేసీఆర్ సీఎం అయి 8 ఏళ్లయ్యిందని పాలమూరు మారిందా? అని ప్రశ్నించారు రేవంత్. వాల్మికి బోయల్ని ఎస్టీలో చేరుస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. 2 సార్లు గెలిచి, 8 ఏళ్లుగా పదవిలో ఉండి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఇతరులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని.. కాపాడేది కూడా తమ పార్టీనే అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ జెండా ను ఎగురవేస్తానని తెలిపారు.
ప్రశాంత్ కిశోర్ తో కలిసి కేసీఆర్ నాటకాలకు తెర తీశారని మండిపడ్డారు రేవంత్. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని చెబుతూనే.. హాస్పిటల్ ఫోటోలు, వీడియోలతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని విమర్శించారు. డిసెంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం రద్దవుతుందని.. వచ్చే మార్చికల్లా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పాలమూరును సస్యశ్యామలం చేస్తామని.. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కాంగ్రెస్ హయాంలోనే 30 కిలోమీటర్లు పూర్తయిందన్నారు రేవంత్. అదే టీఆర్ఎస్ సర్కార్ 8 ఏళ్లుగా 10 కిలోమీటర్ల టన్నెల్ కూడా తవ్వలేకపోయిందని తెలిపారు. వాల్మీకి బోయలతోపాటు ముదిరాజ్, బెస్తలను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఒక్క ముదిరాజ్ ఎదిగితే నిందలు వేసి బయటకు పంపారని.. ఎస్సీ వర్గీకరణ సాధిస్తానని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు.