రాజకీయాల్లో విమర్శలు కామనే. ప్రెస్ మీట్లు, సభల్లో ఎక్కువగా తిట్టుకోవడం అందరికీ తెలుసు. అయితే.. సోషల్ మీడియా వచ్చాక సవాల్ కు ప్రతి సవాల్.. కామెంట్ కు కౌంటర్ అన్నీ అందులోనే అధికంగా వచ్చేస్తున్నాయి. మంత్రుల నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా అందరూ తమను హైలెట్ చేసుకోవడానికి, ఎదుటివారిని తిట్టడానికి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ను బాగా వాడుతున్నారు. ఈమధ్య బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలన్నీ ట్విట్టర్ లోనే ఉంటున్నాయి. అటు ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే అస్త్రాన్ని వాడుతున్నారు. విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
తాజాగా రేవంత్ రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందుగా టీఆర్ఎస్ కు కేటాయించిన భూమిపై నిలదీశారు రేవంత్. ‘‘దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ కు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణ. జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ’’ అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. ఈసారి పాలమూరు వలసలకు సంబంధించి ప్రశ్నించారు. ‘‘అయ్యాకొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్ ఇవ్వొచ్చు. పాలమూరు పచ్చబడ్డదన్నది జూటామాట. సందేహం ఉంటే క్షేత్రానికి వెళ్లి నిజనిర్ధారణ చేద్దాం. వచ్చే దమ్ముందా కేటీఆర్?’’ అంటూ సవాల్ చేశారు.
ఇవే కాదు.. అంతకుముందు రైతుల సమస్యల గురించి కూడా రేవంత్ ప్రశ్నించారు. ‘‘గుబులురేపుతోన్న మొగులు. కళ్లల్లో నీళ్లు, కల్లాల్లో ధాన్యం. సర్కారు కొనదు. దళారీ మద్ధతు ధర ఇవ్వడు. అగ్గువకైనా అమ్ముకోకపోతే తన కష్టం వర్షం పాలవుతుందేమోనన్న భయం రైతుది. ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి సిగ్గనిపించడం లేదా కేసీఆర్?’’ అంటూ మండిపడ్డారు. సర్కార్ తీరును ఎండగడుతూ ఇలా ఏదో ఒక అంశంపై నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి.