– పబ్ ఘటనలో కార్ల యజమానులపై చర్యలేవి?
– ఎందుకు వారి వివరాలు చెప్పడం లేదు
– ఇన్నోవా కారు గుర్తించడంలో ఆలస్యం
– ఆధారాలు చెరిపేసేందుకేనా?
– ప్రతీ క్రైమ్ ఘటన వెనుక ఉంటోంది..
– టీఆర్ఎస్, ఎంఐఎం నేతలే
Advertisements
రాష్ట్రంలో పాశవిక ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ కు పట్టదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అమ్నేసియా పబ్ వ్యవహారంపై స్పందించిన ఆయన..ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హత్యలు,భూ ఆక్రమణలు, అత్యాచారాల్లో టీఆర్ఎస్ ,ఎంఐఎంకు చెందినవారే ఉంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
మైనర్ బాలిక అత్యాచార కేసులో సీపీ మాటలు చూస్తుంటే.. నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమౌతోందన్నారు రేవంత్. ఈ ఘటనలో బాధితురాలు ప్రయాణించిన కారు కీలకమైన ఆధారమని చెప్పారు. మైనర్లు వాహనం నడిపినప్పుడు యజమానులకు పోలీసులు సమాచారం ఇవ్వాలన్నఆయన.. వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని గుర్తు చేశారు.
ఆ వాహనాలు ఎవరివి..వారిని ఎందుకు విచారించలేదు..ఆ వివరాలన్నింటినీ సీపీ ఆనంద్ ఎందుకు వెల్లడించలేదు..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్ పదవి ఇచ్చిన చైర్మన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వస్తున్నాయని..కారు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనంగా వార్తలు వస్తున్నాయన్నఆయన.. యజమాని వివరాలు ఎందుకు దాచి పెడుతున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వ వాహనాన్నిఆసాంఘిక కార్యకలాపాలకు వినియోగించినప్పుడు కారు యజమాని వివరాలు ఎందుకు చెప్పడం లేదన్నారు.ఘటన జరిగిన 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇన్నోవా వాహనాన్నిపోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు.ఆధారాలను మాయం చేసి చెరిపేసి అసలు నిందితులను రక్షించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు కనపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని పబ్స్, మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు రేవంత్.విశ్వనగరంగా ఉండాల్సిన హైదరాబాద్ ను విష నగరంగా మార్చారంటూ ఫైరయ్యారు. నగరంలో మాదకద్రవ్యాలు,పబ్స్ పై తాను ఎంతో కాలం నుంచి పోరాడుతున్నానని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన నాటినుండి హైదరాబాద్ లో పబ్ సంఖ్య విచ్చలవిడిగా పెరిగిందని వివరించారు.
పబ్స్ లోకి మైనర్లను అనుమతి ఇస్తున్నందుకు యజమానులపై కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్న ఆయన.. లైసెన్స్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని.. అవసరమైతే యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారిపై భౌతిక దాడులకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. వెంటనే ఇన్నోవా, బెంజ్ కార్ల యజమానులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.