సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిహార్ ముఠాకు సోమేష్ లీడర్ అని అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆయన సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి, వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. సోమేష్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేష్ కు తాకిందన్నారు రేవంత్. తెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ఇప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈమధ్య ఐపీఎస్ ల బదిలీల విషయంలో స్పందించిన రేవంత్ బిహార్ అధికారులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మండిపడ్డారు. తెలంగాణ అధికారులకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు సీఎస్ అంశంలోనూ అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై మంగళవారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. కానీ, ఆయన తెలంగాణకే మొగ్గు చూపారు. తనను ఏపీకీ కేటాయించడంపై కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు సోమేష్. తెలంగాణ సీఎస్ తో పాటు మరో 15మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కూడా క్యాట్ ఉత్తర్వులతో ఇక్కడే పని చేస్తున్నారు. అయితే.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా దీనిపై వాదనలు జరగగా.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. సోమేష్ కుమార్ న్యాయవాది తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని కోరారు. కానీ, కోర్టు దానికి అంగీకరించలేదు.