మెడికో ప్రీతి మృతిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. గిరిజన వైద్య విద్యార్థిని.. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ప్రీతి మరణం అత్యంత బాధాకరమని సంతాపం తెలిపారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు రేవంత్. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె మరణాన్ని అన్ని కోణాల్లో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.
ప్రీతీది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు ఆమె తండ్రి. ర్యాగింగ్ ఇష్యూను హెచ్ఓడీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న ఆయన.. ప్రీతి జోలికి సైఫ్ రాకుండా ఆపలేకపోయారని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఇంకొందరు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు నిమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. కుటుంబసభ్యులు సంతకం చేస్తేనే బాడీని షిఫ్ట్ చేయడానికి వీలు ఉంటుంది. దీంతో ప్రీతి కుటుంబసభ్యులను ఒప్పించే పనిలో ఉన్నారు పోలీసులు.