కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశారని ఆయన అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి స్పష్టత లేకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడ్జెట్‌లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులను చూస్తే తీవ్రమైన నిరాశ కలిగిందని పేర్కొన్నారు. పేదలకు ఇండ్లు ఇస్తామన్న హామీని కూడా అమలు చేయలేదన్నారు. విభజన హామీల అమలుకు నిధులు కేటాయించలేదన్నారు.
బడ్జెట్‌లో ఐటీఆర్ కారిడార్ ప్రస్తావన లేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని ఆయన మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు దోషులని ఆరోపించారు.
ఈ బడ్జెట్‌లో తెలంగాణలోని పలు సంస్థలకు కేటాయింపులు చేశారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్‌కు (ఈఏపీ కింద) రూ. 300 కోట్లు, సింగరేణికి రూ. 1,650 కోట్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు. ఇక వాటా పరంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.