ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ముగిసింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోం.. ఇకపై రా రైసే ఇస్తామని అన్ని ఒప్పందాలు చేసుకుని.. ఇప్పుడు ఏదైనా తీసుకోవాలని ధర్నాలకు దిగిన కేసీఆర్.. చివరకు తామే ధాన్యం కొంటామని ప్రకటించారు. మూడు గంటల కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఓవైపు కేంద్రాన్ని తిడుతూ.. ఇంకోవైపు రైతులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ నిరంతర పోరాటం సాగిస్తుందని చెప్పారు. రైతు సమస్యలపై తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఫలితమే ధాన్యం కొనడానికి కేసీఆర్ నిర్ణయానికి కారణమన్నారు. అయినా కూడా కేసీఆర్ ను నమ్మడానికి లేదని.. చివరి గింజ కొనే వరకు నిఘా పెడతామని తెలిపారు. తేడా వస్తే కేసీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
నిజానికి రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. కేసీఆర్ హామీ ఇచ్చారంటే.. అది ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు ఆయన ఇచ్చిన హామీలు.. అమలయిన తీరును గమనిస్తే అదే అనిపిస్తుంది. దళిత సీఎం నుంచి దళిత బంధు దాకా.. ఎన్నో హామీలు గుప్పించి చాలా వరకు విస్మరించారు.
అంతెందుకు ఈమధ్యే ప్రకటించిన ఉద్యోగాల సంగతి ఏమైంది. వెంటనే నోటిఫికేషన్లు అన్నారు. ఇంతవరకు చేసిందేం లేదు. ఇప్పుడు ధాన్యం విషయంలో కూడా అలాగే చేస్తారేమోనని రేవంత్ ఆ విధంగా మాట్లాడారు. ఈ విషయంలో కొనుగోళ్లపై నిఘా పెడతామని.. చివరి గింజ కొనే దాకా కేసీఆర్ ను వదిలేదని స్పష్టం చేశారు.