పేపర్ లీకేజ్ కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన స్పందించారు. తనకు ఇంకా అందలేదని.. ఆ నోటీసులకు భయపడేది లేదని వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు ఇవ్వనని స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తామని పేర్కొన్నారు.
30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాకా పోరాటం ఆపమని.. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు.. వారిని విచారిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పదేపదే తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు అధికారులు.
ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయన్న రేవంత్ ఆరోపణపై నోటీసులిచ్చారు. మీకు తెలిసిన సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ పీఏ సొంత మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని టీపీసీసీ రేవంత్ ఇటీవల ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డితో అదే మండలానికి చెందిన కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధాలున్నాయని ఆరోపించారు.
ఔట్ సోర్సింగ్ లో రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం ఇప్పించి.. ప్రమోషన్ ఇప్పించడంలో కేటీఆర్ పీఏ పాత్ర ఉందన్నారు రేవంత్. కేటీఆర్ ప్రమేయంతో కేసీఆర్ ఆఫీస్ పాత్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతికి రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు కాగా.. మల్యాల మండలం నుంచి గ్రూప్ -1 పరీక్ష రాసిన వారికి అత్యధిక మార్కులు వచ్చాయని అన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిట్ రేవంత్ కు నోటీసులు పంపించింది. అయితే.. తాను మాత్రం సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానని అంటున్నారు.