మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిమ్జ్ భూ నిర్వాసితులపై జరిగిన లాఠీఛార్జ్ గురించి నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ చేసిన ట్వీట్
“బలవంతంగా భూమిని గుంజుకోవడం… బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం… కేటీఆర్.. దీనిని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా? భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీ దెబ్బలు… లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా?”
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి బుధవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే.. ఆయన పర్యటన సందర్భంగా నిమ్జ్ భూ నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. తమకు పరిహారం ఇవ్వకుండా, సమస్యలు పరిష్కరించకుండా భూములు లాక్కున్నారని నిరసనలు చేపట్టారు.
నిజానికి కేటీఆర్ వస్తున్నారని దాదాపు 10 గ్రామాలకు పైగా పోలీసులను మోహరించారు. షాపులు మూసేసి.. జనం బయటకు రాకుండా చూసుకున్నారు. కానీ.. కొందరు నిర్వాసితులు పోలీసులకు దొరకకుండా ఆందోళనలు కొనసాగించారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే ర్యాలీగా వచ్చిన భూ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపుచేసే క్రమంలో లాఠీ ఛార్జ్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించి.. కేటీఆర్ ను టార్గెట్ చేశారు. భూములు త్యాగం చేసిన రైతుకు లాఠీ దెబ్బలే మిగిలాయంటూ ఫైరయ్యారు.