నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సమస్యగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. పేపర్ లీకేజ్ ఇష్యూకి సంబంధించి దీక్షకు దిగారాయన. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని.. అసలు, సర్కారునే రద్దు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదని నిలదీశారు.
చంచల్ గూడ జైలుకు వెళ్లిన కొందరు.. నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. అందుకే, కేటీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మాల్యాల మండలంలో గ్రూప్-1 పరీక్షల్లో వంద మందికి పైగా 103 పైగా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వారి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్ర ఉందో లేదో విచారణ చేపట్టాలన్నారు రేవంత్. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా? లేదా? అని అడిగారు. మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దిందని ఆరోపించారు. ఈ ఆరోపణల నుంచి కేటీఆర్ తప్పించుకోలేరని.. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. నిరుద్యోగుల పట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? అంటూ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదన్న రేవంత్.. పేపర్ లీకేజ్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రధారులు అంటూ విమర్శించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం వాదనలు వినిపిస్తామని.. 21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసి తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతామన్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీకొడుకులను చంచల్ గూడ జైలుకు పంపుదాం అంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.