బీఆర్ఎస్ లీడర్లు ప్రకృతిని నాశనం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాతో వాగులు లేకుండా చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మానుకొండూరు వాగును చూసి తాను షాకయ్యానని చెప్పారు.
సీఎం కేసీఆర్ కు ప్రకృతే బుద్ధి చెబుతుందని ఆయన అన్నారు. నీళ్లు, ఇసుక, వైన్ అమ్ముకున్నోడు ఎప్పటికీ బాగుపడరంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తామని ఆయన చెప్పారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. పాలకుర్తిలో పీజీ చేసిన వికలాంగుని కష్టాలు చూసి తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. వికలాంగుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
రైతులు మూస ధోరణిలో వ్యవసాయం చేయకుండా చూస్తామని పేర్కొన్నారు. రైతుల్లో అవగాహన తీసుకు వచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు బాగుపడతారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని భూముల్లో గతంలో 23 రకాల పంటలు పండించే వారని వెల్లడించారు. కానీ ఇపుడు రెండు మూడు పంటలకే పరిమితం అయ్యారని విమర్శించారు.
అధిక దిగుబడి కోసం రసాయనాలతో పంటలు పండిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ పంటలను తిని నేటి తరం వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏండ్లకే గుండపోటు రావడం కూడా ఇందుకు సంకేతమన్నారు.
రేవంత్ రెడ్డి భద్రతపై దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు భద్రత పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి యాత్రకు భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. యాత్రకు భద్రత కల్పించే విషయంలో ఇప్పటికే తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్, జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారన్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.