– లిక్కర్ స్కాం కన్నా వెయ్యి రెట్ల కుంభకోణం
– ఇప్పటికాదా ఐఆర్సీ ఒక్క రూపాయి కట్టలేదు
– ఒప్పందాలను ఉల్లింఘిస్తున్నా చర్యలేవి?
– ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే..
– బీజేపీ నేతలు ఎక్కడికి పోయారు?
– ఈడీ, సీబీఐ ఎందుకు రావడం లేదు
– ఓఆర్ఆర్ టెండర్ అంశంపై రేవంత్ ఆగ్రహం
ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి.. ఏప్రిల్ 27న లెటర్ ఆఫ్ అపాయింట్ మెంట్ ఇచ్చారని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారంతో 30 రోజులు పూర్తయిందని.. 25 శాతం అంటే దాదాపుగా రూ.1900 కోట్లను ప్రభుత్వానికి ఐఆర్సీ డెవలపర్స్ చెల్లించాల్సి వుందన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. సదరు సంస్థ ఒప్పందాలను ఉల్లంఘించిందన్నారు.
కానీ ఆ ఉల్లంఘనను కప్పిపుచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒప్పందాన్ని రద్దు చేసి టెండర్ క్యాన్సిల్ చేయాలని తాము అడిగితే ప్రభుత్వం బుకాయిస్తోందని, అసలు అలాంటి నిబంధనలే లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఈ నిబంధనలు ప్రభుత్వ కన్సిషన్ అగ్రిమెంట్ లో ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చిందా? అని ప్రశ్నించారు.
ఒకవేళ అలా మార్చితే బయటపెట్టాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ఔటర్ రింగు రోడ్డు ఆస్తిని 7388 కోట్లకు అమ్ముకున్నారని ఫైరయ్యారు. ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం లాగా పెద్ద కుంభకోణమన్నారు రేవంత్. ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా వెయ్యి రెట్ల స్కాం అని విమర్శించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఎందుకు విచారణ జరగడం లేదని.. ఈడీ, సీబీఐ ఎందుకు రావడం లేదని అడిగారు. కేంద్రానికి దీనిపై బీజేపీ నేతలు ఎందుకు లేఖలు రాయడం లేదన్నారు.
బీజేపీ అసలు రంగు బయటపడిందని.. బీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని తాను అందుకే చెప్పానన్నారు. ఇప్పటికైనా భ్రమలు వీడి బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆలోచన చేసి మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకోండని సూచించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ను తాను ప్రశ్నిస్తున్నాని బీఆర్ఎస్ కు, మోడీకి మైనారిటీ ఓట్లను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు రేవంత్. దీన్ని ఎలా సమర్దించుకుంటారు? అని నిలదీశారు.
ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని హరీశ్ తమ పాలనను సమర్దించుకుంటారని ప్రశ్నించారు. తాను స్వాతిముత్యం, మామ ఆణిముత్యం అని హరీశ్ అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. సెక్యూరిటీ లేకుండా హరీశ్, కేటీఆర్ ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని సవాల్ విసిరారు. క్షేమంగా తిరిగివస్తే వాళ్లు చెప్పింది నిజమని ఒప్పుకుంటామన్నారు.
నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్దమా? గవర్నర్ కు గంటా చక్రపాణి ఇచ్చిన నివేదిక అబద్దమా? అని ప్రశ్నించారు. 110 నెలల్లో లక్ష 10వేల మంది పదవీ విరమణ చేశారన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు ఇప్పటి వరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. హరీశ్ పొడుగు ఉంటే సరిపోదు.. మెదడు కూడా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆ మెదడు మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదంటూ సెటైర్లు వేశారు.