తెలంగాణలో అన్నదాతలు పడుతున్న కష్టాన్ని చూస్తూనే ఉన్నాం. ఓవైపు ధాన్యం రాశులు పోసుకుని ఎప్పుడు కొంటారా? అని ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు ఎప్పుడు వర్షం పడుతుందో అని భయంతో గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవేవీ పట్టనట్టు పంజాబ్ రైతులకు సాయం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ఈ విషయంలో కేసీఆర్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎంను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి… ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!” అని ట్వీట్ చేశారు రేవంత్.
రేవంత్ చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతులపై కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి ఆయన చండీగఢ్ టూరే నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఆదివారం చండీగఢ్ లో రైతులు, జవాన్ల కుటుంబాలను కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున అందించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే స్వార్ధంతో కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.