బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మీడియాతో చిట్ చాట్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం ఆయన బీజేపీలోకి వెళ్ళారో.. అది నెరవేరడం లేదని చెప్పారు. ఇది ఈటల మాటల్లో స్పష్టమౌతోందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీలోకి వెళ్లిన ఈటలకు.. అక్కడకు వెళ్లిన కొన్నాళ్ళకే సీన్ అర్ధమైందని తెలిపారు. అక్కడ కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తెలుసుకున్నారని చెప్పారు. రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్ నియంతృత్వ ధోరణిని గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని చెప్పారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైందన్నారు. కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ కు అంబేద్కర్ మీద మొదటి నుంచి కక్షేనని విమర్శించారు. కేసీఆర్ బర్త్ డే రోజు కాకుండా.. అంబేద్కర్ జయంతి నాడు సెక్రటేరియట్ ను ప్రారంబిస్తే గౌరవం ఉండేదన్నారు. ఈటల, వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్దాంతాలను విశ్వసించరని చెప్పారు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వారు వ్యతిరేకిస్తారని.. బీజేపీ ఐడియాలజీతో ఆ ముగ్గిరికి సంబంధం లేదని తెలిపారు.
బీజేపీలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారంటే.. ఏదో అసంతృప్తి ఉన్నట్టే కదా అని చెప్పారు రేవంత్. ఆయన ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేకపోతున్నారన్నారు. రాజేందర్, వివేక్, విశ్వేశ్వరరెడ్డి వాళ్లదారి వాళ్లు చూసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వాళ్లు నమ్మిన సిద్దాంతంపై నడవాలని సూచించారు. హుజూరాబాద్ అయినా మునుగోడు అయినా సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయని వివరించారు. మిగతా ఎన్నికల్లో ఓట్లు రావన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారన్న రేవంత్.. హైకమాండ్ భట్టికి భాధ్యతలు ఇచ్చిందని తెలిపారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పారు. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి భాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదన్నారు. కేసీఆర్ విష ప్రయోగంలో ఈటల కూడా పాత్రధారి అవుతున్నారన్న రేవంత్.. ఆయన లెఫ్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. కానీ, కానీ రైటిస్ట్ పార్టీలోకి పోయేలా కేసీఆర్ చేశారన్నారు. ఈటలకు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదని.. కానీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెంచారని గుర్తు చేశారు. కేసీఆర్ అనుకున్నదే రాజేందర్ తో చేయిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.
ఈటల ఏమన్నారంటే..?
సీఎం కేసీఆర్ అన్నిప్రతిపక్ష పార్టీల్లోనూ ఇన్ ఫార్మర్లు, కోవర్టులను పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ వారితో కథనాలను ప్రచారం చేయిస్తారని అన్నారు. ఈ పార్టీల కంటే చివరకు కేసీఆరే దిక్కు అని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని తెలిపారు. తన కదలికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా పెట్టారని చెప్పారు.