అచ్చంపేట నుంచి హైదరాబాద్ వైపుగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తూర్పారబడుతూ ముందుకు సాగుతున్నారు. రైతులను అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టడానికి మోడీ, కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మోదీని, ఫాంహౌస్ లో దాక్కున్న కేసీఆర్ ను బయటకు రప్పించాలంటే రైతు ఉద్యమాలు దేశం నలుమూలల విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో దీక్ష చేస్తోన్న రైతుల్లో 195 మంది చనిపోయారన్న రేవంత్ రెడ్డి,. మోదీ కనీసం వాళ్లతో మాట్లాడిన పాపాన పోలేదని విమర్శించారు.
పాదయాత్రలో ప్రజలు చెప్పుకుంటున్న బాధలను వివరించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు రెండు సార్లు ఓటేశా… డబుల్ బెడ్ రూం రాలేదు, గుడిసెకు కరెంట్ మీటర్ వచ్చిందని ఓ అవ్వ ఆవేదనగా చెప్పిందన్నారు. కేసీఆర్ ఇంట్లో నెలకు ప్రభుత్వ సొమ్ము రూ.25 లక్షలు తీసుకుంటున్నారు… తమ ఇంట్లో ఇద్దరు ముసలోళ్లం ఉంటే ఒకరి పెన్షన్ పీకేశారని మరో ముసలవ్వ బాధపడిందన్నారు. ఇక కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు…కానీ చెవులకున్న బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పార్వతమ్మ అనే ఆవిడ చెప్పిందని వివరించారు రేవంత్ రెడ్డి.
ఇక డ్వాక్రా మహిళలను పరిస్థితి ఏంటని అడిగితే… మొత్తం దివాళా తీశామని చెప్పినట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. చదువుకున్నోడిని అడిగితే 30 ఏళ్లొచ్చినై… నౌకరి రాలేదు, వస్తే తప్ప పెళ్లి అయ్యేలా లేదు బాధపడ్డాడని చెప్పుకొచ్చారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కప్పం కట్టకపోతే ఇసుక ట్రాక్టర్ కదలనివ్వడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదని… కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఐకేపీ కేంద్రాలలో కొనరని… మార్కెట్ యార్డులు ఉండవని ప్రభుత్వం చెబుతోందని.. పంట కొనేవాళ్లు లేకపోతే ఎవరి దగ్గరకు పోవాలని ప్రశ్నించారు. నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని… అంతకుముందు కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ ప్రజాక్షేత్రంలో తీర్మానాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.