– జగిత్యాల జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
– కవిత ఈడీ విచారణపై కీలక వ్యాఖ్యలు
– విచారణ పేరుతో డ్రామాలు అంటూ విమర్శలు
– ఈడీ తలచుకుంటే వెంటనే జైల్లో వేయొచ్చు
– కానీ, చేయడం లేదు
– అంతా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్
– ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శన
– మెట్ పల్లి మార్కెట్ లో పసుపు రైతులతో చర్చలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అనుకుంటే గంటలో కవితను జైలుకు పంపొచ్చని.. కానీ, విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయితే.. కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని అన్నారు రేవంత్.
ఇక మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు రేవంత్. ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారని గుర్తు చేశారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే.. తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని తేల్చి చెప్పారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 10 లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని ఎందుకు తెరవరని ప్రశ్నించారు. రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనపై చర్చ పెడదామని సవాల్ విసిరారు రేవంత్. వ్యవసాయ మంత్రి వస్తారా, ఐటీ మంత్రి వస్తారా.. మీ ఇష్టం అంటూ ఛాలెంజ్ చేశారు.
తమది రైతులను ఆదుకునే విధానమని.. బీఆర్ఎస్ ది ఆత్మహత్యల విధానమని విమర్శించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. వరి వేస్తే ఉరే అని ప్రకటించారని.. కేసీఆర్ చెబుతున్న అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా? అంటూ చురకలంటించారు. తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మెట్ పల్లిలో పసుపు మార్కెట్ ను సందర్శించారు రేవంత్. అక్కడి రైతులను సమస్యల గురించి తెలుసుకున్నారు.