– తెలుగువాళ్లంటే ఎందుకంత చిన్నచూపు
– వెంకయ్య నాయుడిని అవమానిస్తున్నారు
– నార్త్ ఇండియా వాళ్లకే ప్రాధాన్యం ఇస్తారా?
– సౌత్ నేతలు ఏం పాపం చేశారు?
– అసలు.. కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో ఎందుకు?
– తెలంగాణను మోడీ అవమానించింది నిజం కాదా?
– బీజేపీ, మోడీపై రేవంత్ ఫైర్
ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను బీజేపీ నేతలు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, మోడీపై మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ బిల్లు ప్రక్రియ పూర్తయ్యే వరకూ సోనియాగాంధీ చాలా కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని, అలాంటి ఆమెను పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ తప్పుపట్టారని మండిపడ్డారు.
ఎనిమిదేళ్ల తర్వాత లోక్ సభలో రాష్ట్ర ఏర్పాటును మోడీ అవమానించారని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇన్నేళ్లలో తెలంగాణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా అనరాని మాటలు అన్నారని మండిపడ్డారు. నిధుల విషయం గురించి కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా మోడీ మాట్లాడి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన రోజు చీకటి రోజు అని మోడీ మాట్లాడారని.. పార్లమెంట్ లో ఆమోదించిన అంశాలు మోడీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకి న్యాయం చేయకపోగా.. రాష్ట్ర ఏర్పాటును తప్పు పట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఏమైందని, స్విస్ బ్యాంక్ డబ్బులు వెనక్కి తెస్తా అన్నారు ఏమైందని నిలదీశారు.
తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్నచూపు అని ఆరోపించారు రేవంత్. ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని అవమానించారు అని విమర్శించారు. ఏపీకి మంత్రి లేడని తెలంగాణకి ఉన్నా లాభం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తర భారతదేశానికి మాత్రం మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లోనూ తెలుగువాళ్లను అధమస్థాయి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించారు. అసలు.. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నేషనల్ పార్టీలు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తాయని.. మరి తెలంగాణలో ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.