– ధాన్యం విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీది డ్రామా
– కుమ్మక్కయి రైతులను మోసం
– ఎన్నికల సమయంలో బీజేపీకి కేసీఆర్ సాయం
– అందుకే.. టీఆర్‌ఎస్ అక్రమాలను పట్టించుకోవడం లేదా?
– కేసీఆర్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోరు?
– సింగరేణి స్కాంపై ప్రధాని స్పందించాల్సిందే!
– రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మొత్తంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు.
ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం బీజేపీకి కేసీఆర్ నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు రేవంత్. కేంద్రంపై నమ్మకం లేనందునే కోర్టు తలుపులు తట్టామని.. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లు, సింగరేణి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా సింగరేణి సీఎండీ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి కోల్ నిభంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారని ఆరోపించారు రేవంత్. మోడీ ప్రభుత్వం కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందని… కోల్ మైన్ టెండర్ల పేరిట రూ.50వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. టెండర్ల నియమ నిబంధనలు కూడా ఓ కంపెనీని దృష్టిలో పెట్టుకుని రూపొందించారని ఆరోపించారు. దొంగ సొమ్మును బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి పంచుకుంటున్నాయని మండిపడ్డారు రేవంత్.
అమిత్ షా, కేసీఆర్, అసదుద్దిన్ ఓవైసీ కలసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పై బీజేపీ చెబుతున్న పోరాటం బూటకమేనని.. ధాన్యంపైనా ఇరు పార్టీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని ఫైరయ్యారు. సింగరేణిలో జరుగుతున్న ఉల్లంఘనల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో ఎంక్వైరీ చేయించాలన్నారు రేవంత్.