ప్రధాని మోడీ ప్లాన్ లో భాగంగానే కేసీఆర్ యూపీఏను చీల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, నితీశ్ కుమార్, మాయావతిని కేసీఆర్ ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. మోడీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు.
అసోం సీఎం.. రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను సమర్దించుకోవడం బరితెగింపునకు పరాకాష్ట అని అన్నారు రేవంత్. దేశంలోని మహిళలందరిని హిమంత శర్మ కించపరిస్తే మోడీకి చర్యలు తీసుకునే దమ్ములేకపోయిందని విమర్శించారు. రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే బుధవారం ఉదయం వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అందుకు నిరసనగా కమిషనరేట్ల ముట్టడి పిలుపునిచ్చామని వివరించారు.
తాజాగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్.. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్నట్లు ఉందని సెటైర్లు వేశారు రేవంత్. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందో తెలియదు కానీ.. నార్మల్ సెక్షన్స్ పెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. సరైన సెక్షన్స్ నమోదు చేయలేదు కాబట్టే రెండోసారి అసోం సీఎంపై ఫిర్యాదు చేశానన్నారు. సీఎం, హోంమంత్రి ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
వందలాది మంది నిరుద్యోగులు చనిపోతుంటే మూడు రోజుల పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునివ్వడంపై మండిపడ్డారు రేవంత్. విద్యార్థులు, నిరుద్యోగుల చావులకు నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను బహిష్కరించాలని అన్నానని.. అందులో తప్పేముందని నిలదీశారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆయన ఇంట్లో చేసుకోవాలని.. ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే పట్టించుకోకుండా కేటీఆర్ మానవత్వాన్ని మరిచిపోయారని మండిపడ్డారు రేవంత్. ఇప్పటికైనా మనుషుల్లా మారాలని హితవు పలికారు. కేసీఆర్ జన్మదిన వేడుకలపై కేటీఆర్ పిలుపులో అహంభావం, అహంకారం ఉన్నాయన్నారు. కేటీఆర్ దుర్మార్గం ముందు తాను మాట్లాడింది చాలా తక్కువని… కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు గాడిదలకు సంబరాలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.