– జయశంకర్ పేరెత్తకుండా కుట్రలు
– అక్కంపేటపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష
– 12 నెలల్లో కాంగ్రెస్ దే అధికారం
– అక్కంపేటను దత్తత తీసుకుంటాం..
– అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
వరంగల్ డిక్లరేషన్ పై అవగాహనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. దివంగత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వీటిని చేపట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలోని రచ్చబండకు హాజరయ్యారు. తెలంగాణకు దార్శనికత ఇచ్చిన జయశంకర్ స్వగ్రామాన్ని చూడాలని ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.
ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి మచ్చుతునకలా ఉందన్న రేవంత్.. జయశంకర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ పెట్టలేదని మండిపడ్డారు. జయశంకర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మధుసూదనాచారి ఉద్యోగం ఊడగొట్టారని విమర్శించారు. అసలు.. జయశంకర్ పేరు ఎత్తకుండా గుర్తులేకుండా కేసీఆర్ చేశారని ఆరోపించారు.
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు రేవంత్. వరంగల్ రైతు డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ను దింపుడు.. దరణి పోర్టల్ ను గంగలో కలుపడు కచ్చితంగా జరుగుతాయని చెప్పారు. రావిచెట్టు కింద పోచమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా.. కేసీఆర్ ను చెప్పులతో కొట్టుడే.. గద్దె దింపుడే.. అని అన్నారు. 5వేల జనాభా ఉన్న అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చలేదని.. కేసీఆర్ కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు.
అక్కంపేటను కాంగ్రెస్ దత్తద తీసుకుంటుందన్న రేవంత్.. అధికారంలోకి వచ్చాక రాహుల్ ని ఇక్కడకు తీసుకొస్తామని తెలిపారు. దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే ల్యాండ్ పూలింగ్ కు భూములు పోకుండా పోరాడుదామని.. అవసరమైతే రైతులతో కలిసి తాను పోరాడేందుకు వస్తానన్నారు. దళిత ఇంటికి వెళితే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందన్న ఆయన.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదలను, దళితులను వేధిస్తే చెప్పుతో పొట్టుపొట్టు కొడుతామని హెచ్చరించారు.