తొలివెలుగు అంటే ఎందుకంత భయమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని జర్నలిస్టులు అంతా ఖండించాలని చెప్పారు. చంచల్‌గూడా కారాగారం బయట మీడియాతో ఆయన మాట్లాడారు.
‘ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపి.స్తామంటే ఈ జైళ్లు సరిపోతాయా ?? ఈ విధానం ఎంత వరకు కరెక్ట్ ? వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తాం. రవి ప్రకాష్ అరెస్ట్ పూర్తిగా అక్రమ నిర్బంధం. ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు. కెసిఆర్ కూడా అంతే. ఇవాళ కెసిఆర్ అధికారంలో ఉండొచ్చు. కానీ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. జైల్లో కూడా నిర్బంధం కొనసాగడం ఎంతవరకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. అసలు కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి, పాత కేసును కొత్తగా చూపించి అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు రవి ప్రకాష్ ఏం తప్పు చేసారని అరెస్ట్ చేసారు..? సివిల్ గొడవని, ఆర్ధిక నేరం జరిగినట్టుగా చూపించి అరెస్ట్ చేయడం దారుణం..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
‘ఇది కచ్చితంగా జర్నలిజంపై దాడి. టీవీ9ను ఆక్రమించి, మోజో టీవీని గుంజుకున్నారు. అయినా రవి ప్రకాష్ ఎక్కడా మీకు లొంగకుండా తొలివెలుగు వెబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ప్రజలకు చెబుతుంటే, మైహోమ్, మేఘ లాంటి కార్పొరేట్ గద్దలు, అక్రమంగా రవి ప్రకాష్‌ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. గతంలోనే హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. టీవీ9, మోజో టీవీ విషయంలో కోర్ట్ చాలా స్పష్టంగా అదనపు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయొద్దని చెప్పినా కేసులు పెట్టి జైలులో పెట్టడం దేనికి నిదర్శనం. ఇది కక్షపూరితం కాదా ? అని రేవంత్ ప్రశ్నించారు.
ఈ సమయంలో జర్నలిస్టులంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా మాట్లాడడానికి భయపడుతున్నాయి. కెసిఆర్, మైహోమ్, మేఘ ఇచ్చే డబ్బులకు మాట్లాడలేకపోయారు. పోలీసులు కూడా ప్రజల డబ్బుతో పనిచేస్తున్నామన్నది గుర్తుంచుకోవాలి. మైహోమ్, మేఘ కంపెనీలు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు మీ విచక్షణ అధికారాలను ఉపయోగించి పనిచేయాల్సిన అవసరం ఉంది..’ అని రేవంత్ అన్నారు.