మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వేగం పెంచారు. ఆదివారం చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదని విమర్శించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ ఓటుకు రూ.30 వేల నుండి రూ.70 వేల వరకు పంచుతున్నాయని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని అన్నారు. వారి వెంట మీరు ఉండరని అనుకుంటున్నట్లు ప్రజలనుద్దేశించి చెప్పారు.
ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి ముగ్గురు ఉన్న పార్టీకి రాజగోపాల్ వెళ్లారని.. అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఆయనకే తెలియాలని చురకలంటించారు. ఓట్ల రూపంలో ఇలాంటి వారిని చిత్తు చిత్తు చేయాలని కోరారు. చీర నేసే పని కూడా సిరిసిల్లకే పోతోందన్న రేవంత్.. ఈ విషయం ఇక్కడి పద్మశాలీ సోదరులు ఆలోచించాలని సూచించారు. ఎవడైనా పార్టీ మారాలని బెదిరిస్తే ఎంతటివారైనా వాళ్ల వీపు విమానం మోత మోగుతుందని హెచ్చరించారు. పేదోళ్ల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ కు అండగా నిలబడి గెలిపించాలన్న రేవంత్.. నాలుగు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీని గెలిపిస్తే మార్పు రాలేదని వివరించారు. మహిళలంటే కేసీఆర్ కు చిన్న చూపు అని.. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. రాష్ట్రంలో బీజేపీ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఆడవాళ్లకు టికెట్ ఇస్తే అరిష్టం అనుకునే పార్టీలు అని ఆరోపించారు. నలుగురు మహిళలకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్న ఆయన.. రాష్ట్రంలో ఐదుగురు మహిళలను మంత్రులు చేసినట్లు గుర్తు చేశారు.
ఈ ఉప ఎన్నికతో మునుగోడుకు ఏమైనా నిధులు వచ్చాయా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అమ్ముడు పోయినోళ్ళకు మాత్రమే నిధులు వచ్చాయన్నారు. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పైసలతో టీఆర్ఎస్, బీజేపీ కొనాలని చూస్తున్నాయని విమర్శించారు. తేలు మంత్రం తెలియనోడు పాము నోట్లో వేలుపెట్టినట్లు.. కాంగ్రెస్ ను మోసం చేసి పోయినోడు రాజకీయంగా చావడం ఖాయమని హెచ్చరించారు. సీఎం చొక్కా పట్టి మరీ మునుగోడు సమస్యలపై స్రవంతి కొట్లాడుతుందని అన్నారు. రాష్ట్రమంతా మునుగోడు వైపు చూస్తోందని.. తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.