– 111 జీవో రద్దు వెనుక భారీ కుంభకోణం
– 80 శాతం భూములు బీఆర్ఎస్ వాళ్లవే!
– జీవో రద్దుతో ప్రమాదంలో హైదరాబాద్
– కేసీఆర్ ధనదాహం వల్లే ఇదంతా!
– బీజేపీ నేతలు రంకెలేయడం కాదు
– ఏజెన్సీలకు ఫిర్యాదులు చేయాలి
– కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నాం..
– 2019 నుంచి ఇప్పటి దాకా..
– బీఆర్ఎస్ నేతలు కొన్న భూముల లెక్క తేలుస్తాం
– బీఆర్ఎస్ సర్కార్ పై రేవంత్ ఫైర్
జీవో 111 రద్దు, బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపు అంశాల చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్షాలు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. 111 జీవో తీసుకురావడానికి గల కారణాలను వివరించారు. 1908లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 50వేల మంది వరకు చనిపోయారని.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని గుర్తు చేశారు. వరద నివారణకు ఆనాటి నిజాం గ్లోబల్ టెండర్లు పిలిచి… మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించారని తెలిపారు.
జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు రేవంత్. 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్ లో పెట్టారన్నారు. నిజాం, సమైక్య పాలకులు నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ, కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదమని హెచ్చరించారు.
ఈ జీవో రద్దు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు రేవంత్. 80శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లాయన్నారు. 111 జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయమని.. కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాల తరలింపు జరిగిందని గుర్తు చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జంట జలాశయాలకు పైప్ లైన్ ఇస్తాననడం వెనుక కూడా కుట్ర ఉందన్నారు. ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని.. దాని వెనుక లక్షల కోట్ల కుంభకోణం దాగుందని విమర్శించారు.
బందిపోట్లను, దావూద్ నైనా క్షమించవచ్చు కానీ కేసీఆర్, కేటీఆర్ ను క్షమించకూడదన్నారు రేవంత్. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. పర్యావరణ విధ్వంసానికి కేసీఆర్ పాల్పడుతున్నారని.. దీనిపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కొన్న భూముల వివరాలు కమిటీ సేకరిస్తుందని చెప్పారు. అలాగే, ఇప్పటి వరకు జరిగిన భూ లావాదేవీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బినామీ యాక్టును కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేక్ సిటీ హైదరాబాద్ లో చెరువులే లేకుండా పోయాయని.. కేసీఆర్ తీసుకున్న 111 జీవో రద్దు నిర్ణయంతో హైదరాబాద్ లో వరదలు విధ్వంసం పొంచి ఉందని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ లేకుండా లక్షా 30వేల ఎకరాలకు అనుమతులు ఎలా ఇస్తారని అడిగారు. 111 జీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఎందుకు లేదని ప్రశ్నించారు. కనీసం, ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని అడిగారు. జంట నగరాలను కాపాడాలన్న చిత్తశుద్ది ఉంటే కిషన్ రెడ్డి ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలన్నారు రేవంత్. బండి సంజయ్ రంకెలేయడం కాదు.. ఏజెన్సీలకు కంప్లయింట్ చేయాలని హితవు పలికారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.