దేశ సంపదను మోడీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో రాహుల్ అనర్హత వేటును నిరసిస్తూ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని రాహుల్ గాంధీ అందరికీ తెలిసేలా చేశారన్నారు. లోక్ సభలో అదానీ ఇష్యూపై మోడీని రాహుల్ నిలదీస్తే ఇప్పటివరకు సమాధానం లేదని ఫైరయ్యారు.
ధైర్యం లేని బీజేపీ రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు రేవంత్. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ అనర్హత వేటు వేశారని అసహనం వ్యక్తం చేశారు. పదే పదే తనకు కుటుంబం లేదని చెప్పి మోడీ దేశాన్ని నమ్మిస్తున్నారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. దీక్ష ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణపై సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రధాని మోడీ తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు రేవంత్. తన మిత్రుడైన అదానీ కోసం మొత్తం దేశాన్నే కొల్లగొడుతున్నారని అన్నారు. ఫిబ్రవరి 7న తొలిసారి పార్లమెంట్ లో అదానీ కుంభకోణంపై మోడీని రాహుల్ ప్రశ్నించారని గుర్తు చేశారు. దీంతో సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యారని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనను సభలో లేకుండా చేయాలని కుట్ర చేశారన్నారు.
ఈ దీక్షకు పార్టీకి చెందిన అన్ని గ్రూపుల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి సహా అన్ని జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ కూడా దీక్షలో పాలుపంచుకున్నారు.